Kiran's profileనచకి "బ్లాగో"తంPhotosBlogLists Tools Help

Kiran Chakravarthula

Occupation
Location
Interests
See:
http://dotc.iwarp.com/
http://kirandotc.blogspot.com/
There are no music lists on this space.

నచకి "బ్లాగో"తం

Telugu Blogs of NaChaKi aka Kiran Chakravarthula

నేడు తెలుగు భాషా దినోత్సవం

(Originally written in a community on Orkut.Com, the article presented below has undergone minor editing.)
 
మొట్టమొదటగా మనం గ్రహించవలసినది తెలుగు భాష అంతరించిపోలేదు, అంతరించదు కూడా అన్న విషయం!

ప్రతి భాషకు "మనుగడ ప్రశ్నార్థకమే" అన్న పరిస్థితి ఒక్కోసారి తత్కాలీన ప్రజల మనస్సుల్లో రావచ్చు గాక! కానీ, వేయి సంవత్సరాలకు పైగా తల వంచకుండా రెపరెపలాడుతున్న మన భాష బావుటా వెలవెలబోయే పరిస్థితి కనీసం మన తరం బ్రతికి ఉండగా రాదు! తెలుగు భాష సముద్రం వంటిది. కొన్ని ఇతర భాషా పదాలు ప్రవాహాలుగా వచ్చి చేరినంత మాత్రాన ఇందులోని "రుచి" మారదు, కాలుష్యం పెరగదు, అడుగంటిపోదు! (మధురమైన భాషను ఉప్పు నీటి సముద్రంతో పోల్చటం అనౌచిత్యమే కావచ్చు కానీ "రుచి" అన్నది "స్వధర్మం" అన్న అర్థంలో తీసుకోమని మనవి. మరో సంగతి: రుచి అన్న పదానికి "ఉప్పు" అన్న అర్థం కూడా ఆపాదించబడింది.)

శాస్త్ర/సాంకేతిక పారిభాషిక పదాలకు (Scientific/technical jargon) తెలుగు పదాలు లేకపోవడం అనర్థం కాదు, కానీ ఉంటే దైనందిన విద్యార్థి జీవితంలోనూ తెలుగును ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒక భాష బ్రతికి ఉండాలంటే దానికి కావలసింది ఆ భాషకు "దినం" పెట్టి ఉత్సవాలు చెయ్యటం కాదు! పిల్లలతో ఆ భాషలోనే సంభాషించటంతో భాషకు కొత్త ఊపిరులు పోసుకోదు నిజానికి! Mummy, Daddy అని పిలిచినంత మాత్రాన అమ్మ, నాన్న అన్న భావనలోని ప్రేమ తగ్గదు! (నేను తెలుగులోనే సంబోధిస్తానని మనవి.) ఎన్నో సాంస్కృతిక, రాజకీయ అంతరీకరణలు (transformations), యుద్ధాలు తట్టుకుని చరిత్రలో నిలిచిన తెలుగు భాషకు మన రోజువారీ సంభాషణలే ప్రాణవాయువులు అవుతాయనుకోవటం సరి కాదు! చేయవలసిన పని మరొకటి ఉంది... అది ఎంత మంది చేస్తున్నాము?! "అదేంటి?" అంటారా? తెలుగు భాషలో పుస్తకాలు వెలువరించటం, తెలుగు పుస్తకాలు కొని/అరువు తీసుకొని చదవటం, వెలుగులోకి రాని మంచి పుస్తకాలను నలుగురికి పరిచయం చేయటం - "ఇవి చేస్తున్నామా?" అన్నది ప్రతి ఒక్కరూ వేసుకోవలసిన ప్రశ్న! "ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు" అన్న సామెత మనదే! దురదృష్టవశాత్తూ అది మనకు చక్కగా వర్తిస్తుంది! ...నేటి అవసరాలకు తగినట్టు కొత్త పదాలతో భాషను పరిపుష్ఠం చేయటం ఎంత అవసరమో కాలానుగతంగా వస్తున్న సామెతలు, లోకోక్తులు, జాతీయాలు తెలుసుకుని వాటిని అవసరమైనప్పుడు వాడుకోవటం కూడా భాషావికాసానికి అవసరం! మన దృష్టిలో అవన్నీ "ఎప్పుడో బళ్ళో చదువుకుని వదిలేసిన సంగతులు"! సంధులు, సమాసాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఛందస్సు అనవసర కష్టాలు!
మనకు "పుస్తకాలు చదవటం bore", ప్రాచీన కళలైన "సాంప్రదాయక సంగీతనృత్యాలు slow" వంటి ఎన్నో అభిప్రాయాలు రోజూ వినిపిస్తూనే ఉంటాయి. (వినపడటంలేదు అంటే దానికి అర్థం మన కూడా వీటి గురించి ఆలోచించటమూ, చర్చించటమూ మానేసామని!) అదేంటో... ఈ అభిప్రాయాలు వెలువరించిన వాళ్ళు ఒక్క పుస్తకమైనా మనసు పెట్టి చదివారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి! కర్ణాటక సంగీత సంప్రదాయంలో స్వరపరచిన ఒక్క తిల్లానా అయినా విన్నారా అనిపిస్తుంది "మన సంగీతం slow" అన్న మాట వింటే! త్యాగరాజు కాలంలోనూ పాశ్చాత్య సంగీతపు సమాదరణ ఉండేదని, స్వయంగా ఆయనే కొన్ని కృతులని పాశ్చాత్య రీతుల ప్రభావంతో స్వరరచన చేసారని సదరు "విమర్శకు"లకు తెలియదు కాబోలు! పాశ్చాత్యపు సంగీతం ఆదరించారు కనుక కర్ణాటక సంగీతం వినమనటంలేదు... కానీ, ఒకటి విని నచ్చినంత మాత్రాన రెండోది తప్పు అనుకోవటం శోచనీయం!

మన వాళ్ళకు ఉండే మరో జాడ్యం "గొప్పలు చెప్పుకోవటం"! బొట్టు పెట్టుకోవటం మన సంప్రదాయం, అందరికీ నమస్కరించటం మన సంప్రదాయం, తెలుగు భాష తీయనైనది... ఇలా ఎన్నైనా చెబుతాం. ఎందుకు "గొప్ప" అంటే ఇదమిత్థంగా చెప్పలేక తడబడతాం! "గొప్ప" అని తెలిసి అందరికీ చెప్పుకోవాలనిపించటం తప్పు కాదు కానీ ఎందుకు గొప్ప అన్నది తెలుసుకునే జిజ్ఞాస లేని జాతి మనది అన్నది నిష్ఠురసత్యం! "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పుకుని గర్వపడతామే కానీ అక్కడ "దేశం" అంటే వేల భాషలకు ఆలవాలమైన భారతదేశం కాదని, అప్పట్లో ఉన్నది చిన్నా చితకా రాజ్యాలేనని గ్రహించము! మాతృభాష అన్నది ఒక గొప్పతనంగా భావిస్తామే కానీ ఆ కాలంలో ఆయా రాజ్యాల ప్రజలందరూ పొరుగు రాజ్యాల భాషలు నేర్చుకునేవారని గ్రహించము! మన భాష అతి ప్రాచీనమైనదని చెప్పుకుని అందుకు ఉన్నవీ, లేనివీ ఆధారాలు కల్పించుకుంటాం! తమదే ప్రాచీనభాష అన్నందుకు తమిళులని తప్పు పడతాం! అంతే కానీ, నిజంగానే తమిళభాష తెలుగు కన్నా ముందే పుట్టిందేమోనని, కనీసం దాని లిపి దాదాపు 1500 యేళ్ళుగా మారలేదని మనం గ్రహించుకోము!

...తెలుగు భాషను కించపరిచే ఉద్దేశం నాకు ఏనాడూ లేదు! విశ్లేషణాత్మక/విమర్శనాత్మక/తార్కిక దృక్పథాలు కరువై, ఇలాంటి పదాలే బరువైన మన తరానికి తెలుగు భాషని అంతమొదించేంతటి సత్తువ లేదు! తెలుగు భాషను ప్రాణప్రదంగా పూజించేవాళ్ళకు కొదువా లేదు! మనకు పార్శ్వపు అంధత్వం (selective blindness), పార్శ్వపు మతిమరపు (selective amnesia) ఉండటమూ, మన భాషాసంస్కృతుల పట్ల మనకు అవగాహన, అభిమానము లేకపోవటము వంటి ఎన్నో కారణాలు మనమే అనునిత్యం పరీక్షించుకుని మనలని మనం దిద్దుకోవలసిన అవసరం ఉంది... అది కూడా మన అవసరమేనని గ్రహిస్తే చాలు - అదే తెలుగు భాషకు పదివేలు, భావి తరాలకు మనం చేసే మేలు! (పార్శ్వం అంటే selective కాదు... "ఒక వైపు" అని మాత్రమే. కనుక దీనిని సందర్భోచితమైన అనుసరణగానే స్వీకరించానే తప్పించి నిక్కచ్చి అనువాదం కాదు.)
 

కొన్ని వివరణలు:

1. "ఆముక్తమాల్యద"లోనిదిగా ప్రముఖమైన "దేశభాషలందు తెలుగు లెస్స" అనే వ్యాఖ్య కృష్ణదేవరాయలే రచించినట్టు నమ్మితే "దేశం" అన్న పదం "విజయనగర సామ్రా"జ్యాన్ని సూచిస్తుంది. కానీ, శ్రీనాథుడిదిగా చెప్పబడుతున్న "జనని సంస్కృతంబు సకల భాషలకును / దేశభాషలందు తెలుగు లెస్స / ..." అన్న ఆటవెలది పద్యం ఒకటి ఉంది. కానీ, ఏది ముందు వ్రాసినదో ఇదమిత్థంగా తెలియదు! మన కవులు తమకు తాము తక్కువ ప్రాధాన్యం ఇవ్వటం వలనేనేమో... వారి గురించిన విషయాలు వారి రచనల్లో ఎక్కువగా కనిపించవు. అందుకని వారి దేశకాలాలను మనం నిర్ధారించలేని స్థితిలో ఉన్నాము. ఈ విషయాలేవీ మనలో చాలా మందికి తెలియదు! తెలిసినా కూడా పరిశోధించే ఉద్దేశము, పరిశీలించే ఉత్సుకత లేవు చాలా మందిలో!
2. తమిళులు చేసిన స్వార్థపుటన్యాయం వేరే ఉంది: తమిళభాష ప్రాచీనమైనదని ప్రభుత్వం తీర్మానించిన వెంటనే ప్రాచీనభాషలను గుర్తించటానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించిన కాలవ్యవధిని 2000 సంవత్సరాలకు పెంచటం!
3. మన భాషకు లిపి నేటి స్థాయికి చేరినది ఎప్పుడో తెలుసా? ముద్రణ యంత్రాలు మన దేశానికి వచ్చిన తరువాత - అంటే 19వ శతాబ్దంలో!

మరణం - బ్రతుకు ఆటకు తప్పని ముగింపు

వ్రాయదగిన, వ్రాయవలసిన అంశాలు బోలెడు నా కళ్ళ ముందే కనిపిస్తున్నా, నా బుఱ్ఱ నిండుగా ఉన్నా కూడా "ఆ... తరువాత వ్రాయొ"చ్చనుకుంటూ వాయిదా వేస్తూ వచ్చాను. చివరికి నన్ను కదిలించి పూనుకునేట్టు చేసిన సంఘటన "మరణం". ఇది నేను తెలిసినవాళ్ళెవరో చనిపోతే వచ్చిన తొందరపాటో తన్నుకువచ్చిన బాధనో కాదు. నిజానికి ఈవారం వార్తాపత్రికల్లో వచ్చి, నా కంటబడిన మూడు మరణవార్తలూ నాకు తెలిసిన, నేను తెలియని వాళ్ళవే: కొణిదెల వెంకటరావు, బేనజిర్ భుట్టో, పి. జనార్దనరెడ్డి - ఈ ముగ్గురిలో ఒకరిది సహజమరణం, మరొకరిది హత్య, ఇంకొకరిది హఠాన్మరణం. ...ఏదైతేనేం... అన్నీ ఒకటే - మరణం! రెండు నెలల క్రితం కూడా ఒక మరణవార్త విన్నాను... అది నాకు ఎంతో కావలసిన ఒక దగ్గరి బంధువుది. సంతాపం ప్రకటించాలనుకున్నా ఆ బాధ అయినవాళ్ళను చేరదన్న నిస్సహాయస్థితి.

వీళ్ళంతా మనుషులే... నాకు ఏమవుతారో, ఏమి కారో, ...ఏమీ కారో! అయితేనేం... అందరి మరణం ఒకేలా కలచివేసింది. ...కాదు, ఒక్కో మరణం ఒక్కొక్క తీరుగా... అన్నీ కలిసి ఒకటే మనసును దాదాపుగా ఒకేసారి కలచివేసాయి, అంతే! ...అంతేనా? చెప్పలేనిది ఎంతో ఉంది.

నేను తెలుగు చలనచిత్రసీమ "మెగాస్టార్" చిరంజీవికి అభిమానిని ఏమీ కాదు... అయినా అతని తండ్రి మరణం నాలో బాధను కలిగించింది. నేను బేనజిర్ జీవితాన్ని కానీ, రాజకీయాన్ని కానీ ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు... అయినా హత్య వార్త చూసిన కళ్ళు కొన్ని క్షణాల వరకు కనిపిస్తున్న వార్తని నమ్మలేదు. నేను కాంగ్రెస్‌వాదినీ కాను, జనార్దనరెడ్డినీ ప్రత్యక్షంగా ఎఱగను... అయినా అర్ధరాత్రి అతని మరణవార్త చూడగానే ఇంట్లో కాలు నిలవక బైటికి వచ్చి మేలుకునే ఉన్న నా సహచరులతో ఆ వార్త తాలూకు దిగ్భ్రమను పంచుకున్నాను. గతసంవత్సరం సద్దామ్ హుస్సేన్‌ని ఉరి తీసినప్పుడు కూడా ఏదో తెలియని, ఇదమిద్ధంగా చెప్పలేని ఇబ్బందికరమైన భావన. (నేను సద్దామ్ సానుభూతిపరుడిని కాదని మనవి.) మరణమంటే కలిగిన ఒక రకమైన ...జుగుప్స. "జుగుప్స" అన్న భావనే సరైనదా అంటే ...తెలియదు నాకూ!

మరణమంటే...?
విధి చేసిన దారుణమా? మదిలో అనంత(ర) స్మరణమా?
జ్ఞాపకాల తోరణమా? జ్ఞాపకాలతో రణమా?
అనుభవాలు రగిల్చిన వ్రణమా? అనుభూతులు మిగిల్చిన ఋణమా?
ఎవరూ మనకేమీ కాకుండా...పోవటమా??
ఎవరికి ఏమైనా మనకేమీ కాకపోవటమా?!

ఏ మరణం ఎక్కువ బాధాకరం?
తెలిసినవారిదా, తెలియనివారిదా?
"పిచ్చి ప్రశ్న!" అనిపించింది...
 ఈ ప్రశ్న మనసులోకి రాగానే!
వెంటనే ప్రశ్నించిన మనసే హెచ్చరించింది -
జవాబు సులువు కాదని!
"పిచ్చి ప్రశ్న" అనిపించే ప్రతి ప్రశ్నా
సులువైన జవాబు లేనిదే అయి ఉంటుందేం?
...జీవితమనే "పిచ్చి ప్రశ్న"కు
మరణమే "సులువైన జవాబు" అవుతుందా?

ఎవరి మరణవార్త తెలిసినా
మనసులో ఏతత్క్షణంలోనే ఎన్నో ఊహలు...
పుట్టుకకీ చావుకీ ప్రతీకలుగా
అలా పుట్టి ఇలా గిడతాయి
"పునరపి జననం పునరపి మరణం"

"ఆత్మ నాశనము లేని"దన్న గీతాకారుడు
ఇన్ని మరణాల మధ్యన తమ తమ ఆత్మలను
హత్య చేసుకుని బ్రతుకుతున్నవాళ్ళను
లక్ష్యపెడతాడా?
ప్రతి ఘటనకీ స్పందించి స్పందించి
స్పందించటమే మరచిపోయేటంతగా
సొంత ఉనికిని కోల్పోతున్న ప్రాణాలను
పట్టించుకుంటాడా?
"కర్మణ్యేవ-అధికారస్తే మాపలేషు కదాచన"
అన్న హెచ్చరిక మనసులో చేరింది -
"ప్రశ్నించుకో, జవాబు కోసం వెతకొ"ద్దని మెత్తగా వినబడింది!
జీవనవేదం సరిక్రొత్తగా అర్థమైంది!

...మరణవార్త చెవినబడ్డ ప్రతిసారీ శ్రీశ్రీ గుర్తుకొస్తాడు... శ్రీశ్రీని కదిలించిన కొంపెల్ల జనార్దనరావు మరణం గుర్తుకొస్తుంది. "నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన - ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన?" అని ప్రశించిన వేటూరి వేదాంతం గుర్తుకొస్తుంది. "అనుకోలేదని ఆగవు కొన్ని" అన్న ఆత్రేయ ఆవేదన గుర్తుకొస్తుంది. ఎంతటివాడినైనా కదిలించే ఆ మృత్యురూపం గుర్తుకొస్తుంది. "దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువుంది - ఇంత కన్న సైన్యముండునా?" అన్న గురువు సీతారామశాస్త్రి హెచ్చరిక గుర్తుకొస్తుంది. ...నాకు నేను గుర్తుకొస్తాను! (బేనజిర్ చనిపోయిందని తెలిసిన 6-7 గంటలకు, జనార్దనరెడ్డి మరణవార్త తెలిసిన 1-2 గంటల్లోపు మనసులోని తడులకు, సడులకు, సుడులకు అక్షరరూపాన్నిచ్చే యత్నం.)


మారుతున్న సమాజ ముఖచిత్రం

ఎన్నో రోజుల తరువాత వ్రాస్తున్నాను... కానీ, మంచి విషయాలతో వ్రాస్తున్నానన్న తృప్తి ఉంది. ఎన్నో విషయాలు మనసుకు హత్తుకున్నాయి ఇటీవలి కాలంలో.

 

1. హోలీ నాడు భోపాల్ నగరంలో పిల్లలు చేసిందేమిటో తెలుసా? "నీటిని వృధా చేయకూడదు", "నీరు లేకపోతే రేపు లేదు" ("जल नही तो कल नही") అంటూ ప్లకార్డులు పట్టుకుని పొడి రంగులతో హోలీ ఆడుకున్నారు. వారికున్నంత సామాజిక స్పృహ పెద్దలకు కూడా ఉంటే...!

2. మన ప్రస్తుత రాష్ట్రపతి, భౌతిక శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ జీవిత చరిత్ర చదివి స్ఫూర్తి పొంది, మూడు నెలల శ్రమతో ఆ పుస్తకాన్ని అనువదించారు. చెప్పుకోదగ్గ విశేషమేమిటంటే వారు అనువదించింది బ్రెయిలీ లిపిలోకి! మీ ఊహ నిజమే... "రచయిత" రాజేంద్ర ధర్వ్, తప్పులు దిద్దిన కమల్ భగోర్ ఇద్దరూ గుడ్డివాళ్ళే! తమ ఉపాధ్యాయుడు సచిన్ దేవాలియా సాయంతో ఈ బృహత్ కార్యం సాధించిన వీరిద్దరూ భోపాల్ నగరంలో అయిదవ తరగతి చదువుతున్న పేద విద్యార్థులు!

3. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని బాచుపల్లి పంచాయితీ పరిధిలో కొంత మంది ఆల్విన్ ఉద్యోగులు ప్రగతినగర్ అన్న పేరుతో 725 ఇళ్ళతో 1991 లో ఒక కాలనీ నిర్మించుకున్నారు. పంచాయితీలో అభివృద్ధి విషయమై అసంతృప్తి చెందిన  ఈ కాలనీ సంక్షేమ సంఘం 1996 లో హైకోర్ట్ సహాయంతో బాచుపల్లి పంచాయితీ నుంచి వేరుపడి తమంతట తాముగా అభివృద్ధి చెందటం మొదలుపెట్టారు. సరిగ్గా పదేళ్ళలో వీరు సాధించిన ఘనత ఏమిటో తెలుసా? మన దేశంలో ISO గుర్తింపును  పొంది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్నట్టుగా ధ్రువపత్రాన్ని పొందిన మొదటి పంచాయితీ ఇదే! మద్యం అమ్మకాలు లేవు, 99 శాతం పన్నులు ప్రతి నెలా 15వ తేదీకల్లా వసూలవుతాయి, ఇళ్ళన్నిటికీ మరుగుదొడ్ల సౌకర్యముంది, ఇప్పుడు ఊళ్ళో ఉన్న 1200 ఇళ్ళకూ మంజీరా నది నీటి సరఫరా ఉంది, నీటి వాడకాన్ని సూచించే మీటర్లున్నాయి, ప్రతి ఇంటి ముందు 2-5 మొక్కలున్నాయి, తడి చెత్తకీ పొడి చెత్తకీ వేరుగా అన్ని ఇళ్ళ ముందూ చెత్తబుట్టలున్నాయి, పంచాయితీ కార్యాలయంలోని ఫిర్యాదుల పెట్టెలో ఉన్న ఫిర్యాదులు చాలా వరకు 24 గంటలలో పరిష్కరింపబడతాయి, అక్షరాస్యత 99 శాతం, ... ఇలాగే దేశమంతా ఉంటే... सारे जहॉ से अच्छा हिन्दूस्थान हमारा అని మనమంతా ఆనందంగా పాడుకోవచ్చు, కదా!

 

పతితులార, భ్రష్టులార, బాధాసర్పద్రష్టులార, ఏడవకండేడవకండి!

నేను ఈ మధ్య తెలుసుకున్న కొన్ని సామాజిక సేవా సంఘాల గురించి ఇక్కడ ప్రస్తావించాను:
<http://kirandotc.blogspot.com 2006 02 things-are-moving.html>

ఇటీవలే చేరినా వీళ్ళంతా చేస్తున్న మంచి తెలియటానికి ఎక్కువ కాలం పట్టలేదు. మరి క్రమం తప్పక చేస్తున్నప్పుడు ...ఉడికిందో లేదో తెలియటానికి అన్నమంతా పట్టి చూడాలా?

మానవత్వం బ్రతికే ఉందని నిన్న ఒకరు పంపిన సందేశం ద్వారా తెలిసింది - తన ఆటోలో ఉన్న అయిదేళ్ళ పాపకు గుండెకు సంబంధించిన అనారోగ్యముందని ఆ పాప తల్లిదండ్రుల మాటల ద్వారా గ్రహించిన ఆటో డ్రైవర్ వారి వద్ద నుండి డబ్బులు తీసుకోలేదట! - అది తనకు చేతనైన సహాయంగా భావించిన ఆ మానవతామూర్తికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను.

ఎక్కడ మనసుకు సంతోషమూ, తృప్తీ ఉంటాయో, అక్కడే మనసుకు కొంతైనా అశాంతి, బాధ తప్పవేమో! చేసిన అన్ని సహాయాలు ఫలించవు కదా! ...నిన్ననే ఒక నిండు గర్భిణికి రక్తమెక్కించవలసిన అవసరం గురించి తెలిసింది. "హైదరాబాద్ మహానగరంలో ఒక్క అవసరార్థికి రక్తం దొరకదా, దయార్ద్రహృదయులు మన చుట్టూ ఇంత మంది ఉండగా...?" అనుకున్నాను నిశ్చింతగా (ఇన్ని సమాజసేవా ప్రయత్నాలు చూసిన తరువాత పెరిగిన ఆశాభావం కూడానేమో!). ఒక్క రోజులోనే తెలిసింది - కామెర్లు సోకి ఆ గర్భిణి కడుపులోని బిడ్డ మరణించింది! ఆ స్త్రీ కూడా ప్రాణాపాయ స్థితిలోనే ఉందని, బ్రతకటం కష్టమని వైద్యులు పెదవి విరిచారు! ఎంత మంది ఎన్ని రకాలుగా స్పందించినా ...అందరి ప్రాణాలూ నిలవాలంటే ఉన్న కొంత మంది చేతులు కలిస్తే చాలా? ...దీని గురించి ఒకరికి చెబుతోండగా, అనుకోకుండానే, నండూరి విద్యారణ్య (
<http://math.ksu.edu/~nanduri/>) గుర్తొచ్చాడు - 2003 లో క్యాన్సర్‌తో పొరాడి అలసి ప్రాణాలు వదిలిన అసమాన ప్రతిభాశాలి, మిత్రుల మాటల్లో మృదుస్వభావి. నేను ఏనాడూ కలవలేదు, కానీ 2003 లో నా పుట్టిన రోజు నాడే అతని మరణవార్త విన్నాను, రోదించాను. అతనికి సహాయం చేసిన వాళ్ళలో మా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఉన్నారు. కానీ, ఒక మానవతావాది నాతో అన్నట్టు "అమెరికాలో భారతీయులు జాలితో కాక ప్రేమతో అతనికి సహాయం చేసి ఉంటే అతను బ్రతికేవాడేమో"! సరైన సమయంలో సాయం అందక, ప్రపంచానికి ఆ విషయం కూడా తెలియక ముందే ఉనికిని కోల్పోతున్న అభాగ్యులు ఇంకా ఎందరో!

రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు, నిజమే, కానీ శ్రామికులు మాత్రం అది నిర్మాణంలో ఉన్నన్ని రోజులూ - "నేను సైతం..." అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు - "ప్రపంచానికి సమిధనొక్కటి ఆహు"తిచ్చి తమదైన కృషి చేస్తూనే ఉన్నారు, చివరికి "ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్ల"వించి సంతృప్తిని పొందుతున్నారు! మరి ...నేను...? ...మీరు? ...మనం?

పిల్లి మెడలో గంట కట్టేదెవరు?

క్రిస్టోఫర్ డేవిడ్ పెన్లీ - అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్ర పోలీసుల దౌష్ట్యానికి బలైన ఒక ప్రాణం. అమెరికా పోలీసులు అనగానే న్యాయంగానే అతన్ని చంపారనుకోవచ్చు. అతన్ని చంపింది ఎక్కడో తెలుసా? ఒక పాఠశాలలోని బాత్‌రూంలో. పిల్లలని చంపటానికి వచ్చిన ఉగ్రవాదిని పోలీసులు చంపారనుకుంటున్నారా? హతుడి వయసు ఎంతో తెలుసా? పదిహేనేళ్ళు! ...మీ ఊహ నిజమే! ఆ అబ్బాయి ఆ పాఠశాల విద్యార్థి! ఎందుకు చంపారో తెలుసా?! బొమ్మ తుపాకీతో ఒక పోలీస్ అధికారిని బెదిరించినందుకు. అవును, బొమ్మ తుపాకీ! దానిని అసలైన తుపాకీగా భ్రమించిన పోలీసులు ఆ పిల్లవాడిని వెంటనే కాల్చి చంపారు! చంపిన వ్యక్తి పేరు? తెలియదు. వార్తలలో ఎక్కడా వ్రాయలేదు! కనీసం చనిపోయిన క్రిస్టోఫర్ బొమ్మ కూడా వెయ్యలేదు! పోలీస్ కాకపోయి ఉంటే అతనో కిరాతకుడైన హంతకుడు. మరి అతన్ని శిక్షించేదెవరు? మనుషుల్లో పైశాచికత్వాన్ని పారద్రోలేదెవరు?

(నాకు ఈ వార్త చెప్పినది నా తమ్ముడు శశాంక: <http://rahulsashanka.blogspot.com/>)

సిద్ధార్థ్ - ఒక స్ఫూర్తిమంతమైన విజయం

http://us.rediff.com/news/2005/mar/30spec.htm - ఈ కథనము చదివిన వెంటనే వ్రాస్తున్నాను ఈసారి కూడా - ఈ వార్త కూడా అంతగా కదలించింది. ఇతరులను చిన్న చూపు చూడటమనేది అందరమూ ఎప్పుడో ఒకప్పుడు (తెలిసో తెలియకనో) చేస్తూనే ఉంటాము. "నేనేదీ సాధించలే"నని అందరమూ ఎప్పుడో ఒకప్పుడు డీలా పడుతూనే ఉంటాము. ఆ రెండూ ఎంత తప్పో సిద్ధార్థ్ గురించి చదివిన తక్షణమే (మళ్ళీ) తెలిసివచ్చింది. పేరున్న 'స్వదేశీ' సంస్థలు అతనిని తృణీకరిస్తే ఎక్కడి నుంచో వచ్చిన సంస్థ అతని ప్రతిభనే ప్రాతిపదికగా తీసుకుని తగు విధంగా ఉద్యోగమివ్వటమనేది గమనించదగిన సంగతి. అడుగడుగునా ఈసడించి, వెక్కిరించి, తిరస్కరించే ప్రబుద్ధులున్న ఈనాటి మన సమాజంలో సిద్ధార్థ్ ఈ స్థాయిని చేరుకోవటం ఆశ్చర్యానందాలను కలిగించింది. విజయవంతమైన ఈతని జీవితం వెనుక ఎంత మంది ప్రోత్సాహముందో వారందరికీ అభినందనలు, అభివందనాలు. సిద్ధార్థ్ ఇంకా ఉన్నతస్థాయులను చేరుకోవాలని, ఇతని జీవితం మరెందరికో మార్గదర్శకమవాలని, ఇటువంటి కథల నుంచి సమాజం (మనమే) పాఠాలు నేర్చుకోవాలని నా ఆశ.

"ఆ నలుగురు" - నాకు నమ్మకాన్నిచ్చిన చిత్రం

మొదటి సారిగా మనసులో కలిగిన భావాన్ని వెంటనే ఇక్కడ వ్రాస్తున్నాను - అంతగా నన్ను కదిలించింది ఈ చిత్రం. కుటుంబానికి, సమాజానికి సమానమైన ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి జీవితం ఈ చిత్రం. ఆ వ్యక్తి గెలిచినట్టుగా చూపించి ఈ చిత్రాన్ని ముగించటం నాలాంటి ఎందఱికో స్ఫూర్తినిస్తుంది. చిత్రకథానుగుణంగా కథానాయకుడు మరణించటం నిరాశావహ దృక్పథాన్ని సూచించినా ఆ మరణానికి కారణమైన నిరాశని అతని గెలుపు త్రోసి రాజంటుంది, ఈ చిత్రాన్ని చూసి స్ఫూర్తి పొందే వారికి ఆ నిరాశ అనవసరమని అనిపింపజేస్తుంది. సినిమా అన్న మాధ్యమం యొక్క అంతర్గత శక్తిని ఈ చిత్రంలోని సందేశం ప్రశంసాత్మకంగా ఉపయోగించుకుంది. ఈ చిత్రం ఇంకా చాలా మందికి సామాజిక స్పృహను, సంఘం కోసం బ్రతకాలనే తపనను కలిగించగలదని నా నమ్మకం.

హాసం - ఒక పత్రిక పతనం

హాసం - హాస్యము, సంగీతము ముఖ్యాంశాలుగా గత కొన్నేళ్ళుగా ఆంధ్రులను అలరించిన పత్రిక. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చదివేవాళ్ళు ఆ పక్షపత్రికని. వాళ్ళలో కొందరు చాలా కాలం క్రితమే పత్రికలు చదివే అలవాటు పోయిన వాళ్ళు. అయితేనేం, హాసం అందరినీ అలరించేది. అయినా అది ఈనాటి వాణజ్య ప్రపంచంలో నిలవలేక...పోయింది. అంత మంది చందాదారులున్నా, మరి కొందరయినా అప్పుడప్పుడూ కొనేవాళ్ళున్నా, కాగితం నాణ్యత మరీ గొప్పగా లేకపోయినా ఈ పత్రిక ఎందుకు ఆగిపోవలసివచ్చింది అన్న ప్రశ్నకు సమాధానం లేదు, రాదు. తప్పు పాఠకులదా, సంపాదకులదా, పత్రికలదా, ప్రపంచానిదా ఎవరూ చెప్పలేరు.

వెంకటేశ్ మరణం - విషాదభరితం, ఆలోచనాస్పదం, స్ఫూర్తిజనితం

వెంకటేశ్ - అతవి జీవితం గురించి అతను మరణించే ముందు దాకా చాలా మందికి తెలియదు, నాతో సహా. తీరా తెలిసే సరికి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. మరణించిన వెంకటేశ్ ఆశయం వెనుక అతని మాతృమూర్తి ఆదర్శభరితమైన పెంపకముంది. ఆ తల్లి ఈనాటికీ పడుతున్న తపన వెనుక ఆ బిడ్డ చివరి కోరిక ఉంది.

నేడు మన మధ్యన లేని ఒక అసహాయ జీవి ఆవేదన, ఆశయ సాధన, మన దేశపు చట్టంలో ఒక బలీయమైన మార్పు కోసం అతని మరణానంతరం కూడా ఆ తల్లి పడే మథన సార్థకమవాలని, ఈ ఇద్దరి ఆలోచన వెనుక ఆంతర్యాన్ని మనలో కొందఱయినా అర్థం చేసుకుని, అవయవదానం చేయాలని, చేయించాలని ఆశిస్తున్నాను. నేను ఈ సారి భారతదేశం వెళ్ళినపుడు అవయవదానం గురించి వివరాలు సేకరించి, అవయవదానానికి నా ఆమోదం తెలియజేయాలని ఇప్పుడు సంకల్పిస్తున్నాను.

ఆ తల్లి ఉద్యమానికి ఎటువంటి చేయూతనైనా ఇవ్వడానికి సంసిధ్ధంగా ఉన్నాను. అటువంటి వివరాలు ఎవరికైనా తెలిస్తే నాకు తెలియజేయగలరు.

 
There are no photo albums.
No list items have been added yet.